11.24.07
ఛేజింగ్ డే లైట్
మీరు మరో 100 రోజుల్లో చనిపోతారని మీతో మీ వైద్యుడు చెబితే ఏం చేస్తారు? మొదట హతాశులవుతారు. తేరుకున్నాక ఏం ఆలోచిస్తారు.తీర్థ యాత్రలు, బాధ్యతల బదిలీ, కోరుకున్నవన్నీ అనుభవించే ప్రయత్నం, ఆస్థిపాస్థుల ఆరా, వాటి సంబంధించిన లావా దేవీలు, ఇష్టమైన ప్రాంతాలన్నీ తిరగడం మొదలైనవి కదూ.. ఒక పెద్ద బహుళ జాతి సంస్థకి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సి.ఈ.ఓ) గా ఉద్యోగం, విలాసవంతమైన జీవితం, మంచి కుటుంబం, వెనక్కి తిరిగి చూసుకోనక్కర లేని బ్యాంక్ బ్యాలెన్స్, విదేశీ ప్రయాణాలు వగైరా.. వగైరా…ఇలా సాగిపోతున్న ఈజిన్ ఓ కెల్లీ తో అతన్ని పరీక్షించిన వైద్యుడు కూడా ఇదే మాట అన్నాడు.
నేనెంతో అదృష్టవంతుణ్ణి, నేను మరో మూడు నెలలు బ్రతికుంటానని తెలిసింది
పుస్తకం మొదటి వాక్యంతోనే మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తాడు కెల్లీ.
కె.పి.ఎం.జి. (ప్రపంచ ప్రఖ్యాత అక్కౌంటింగ్ సంస్థ) సంస్థలో సి.ఈ.ఓ.గా ఉన్న కెల్లీ, తన రంగంలో తనను విజేతగా నిలిపిన నిబధ్ధత, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే చాతుర్యం, మరణం ముందు బేలగా నిలబడే పరిస్థితి రాకుండా చేశాయంటాడు. వైద్యులు కెల్లీ మరణం చాలా సహజంగా, ఏం నొప్పి, బాధ అనుభవించకుండా జరిగిపోతాయని చెప్పడంతో, ఇంతకన్న అదృష్టమేమిటని అడుగుతాడు కెల్లీ.
క్రైసిస్ మేనేజ్ మెంట్ లో భాగంగా, సంస్థ అనుకోకుండా కష్టాల్లో కూరుకుపోయిన అనేక సందర్భాల్లో, ఆ పరిస్థితి నుండి బయట పడేసిన అనుభవం, తన జీవితంలో వచ్చిన హఠాత్పరిణామాన్ని ఎదుర్కోడంలో సాయపడింది కెల్లీకి.
వైద్యులు కెల్లీకి బ్రెయిన్ క్యాన్సర్ అని నిశ్చయ పరచి, నీకు, మరణానికి మధ్య వ్యత్యాసం మూడు నెలలే అని చెప్పినప్పటి నుంచి, ఆయన తన మరణాన్ని ఆహ్వానించడానికి ఎలా సిద్ధ పడ్డాడు, చివరి 100 రోజులు ఎలా గడిపాడన్నదే చేజింగ్ డే లైట్.
కెల్లీ తమ సంస్థలో మెంటరింగ్ కార్యక్రమానికి శ్రికారం చుడతాడు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి, ఒక్కొక్క మెంటర్ వృత్తి, ఉద్యోగాల్లో అవసరమైన సలహాలనిస్తూ వెన్ను తట్టిప్రోత్సహిస్తుంటారు.
తనను కలవడానికి వచ్చిన ఒక మితృనితో కెల్లీ ఇలా అంటాడు “చూడు, చాల మందికి ఈ అవకాశం రాదు. చాలా మంది తమ చావు సమీపించి నప్పుడు, తీవ్రమైన వ్యాధితో, నొప్పితో, ఆ నిష్రమణ చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నేనలా కాదు, ఎప్పుడొస్తుందో తెలుసు గనక, దానికోసం పూర్తిగా సిధ్ధంగా ఉంటాను. హాయిగా ఆహ్వానిస్తాను.”
ప్రొద్దువాలే సమయంలో గోల్ఫ్ ఆడడం కెల్లీకి ఎంతో ఇష్టం. గోల్ఫ్ ఆటను, తన జీవితాన్ని అనేక సందర్భాల్లో పోలుస్తాడు కెల్లీ.
ఉద్యోగ జివితంలో తన విజయాలను అక్కడక్కడా ఉటంకిస్తాడు. అటువంటివాటిల్లో ఒక ఆసక్తికర సంఘటన ఇక్కడ చెప్తాను.
ఒకరోజు అర్ధరాత్రి కెల్లీకి ఫోన్ వస్తుంది. ఒక అంతర్జాతీయ బ్యాంక్ కు ఆడిటింగ్ చేసే కాంట్రాక్ట్ సంపాదించాలని. ఆ కాంట్రాక్ట్ కోసం అనేక పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి.
కెల్లీ ఈ కాంట్రాక్ట్ సంపాదించాలంటే ఆ బ్యాంక్ అధ్యక్షునితో ముఖాముఖి కలిస్తే చాలు, కెల్లీ అతన్ని ఒప్పించెయ్య గలడు.
ఆయన కార్యదర్శిని సంప్రదించగా, ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారని, మరికొన్ని నెలల వరకు ఆయన ఎవరికీ సంప్రదించేందుకు సమయం ఇవ్వగలిగే స్థితిలో లేరని తెలుస్తుంది.
వెంటనే కెల్లీ అధ్యక్షులవారి కార్యదర్శిని మరలా పలకరించి, ఆయన ప్రయాణాల గురుంచి కనుక్కుంటాడు. ఆ కార్యదర్శికి, కెల్లీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ బ్యాంక్ అధ్యక్షుడు రెండు రోజుల్లో సిడ్నీ నుండి, మెల్ బోర్న్ విమాన ప్రయాణం చేయబోతున్నడని తెలుసుకుని, తానూ అదే విమానానికి, ఆయన పక్క సీటు రిజర్వ్ చేయించుకుంటాడు.
విమానంలో కెల్లీని పక్క సీట్లో చూసి, అతను తనతో మాట్లాడేందుకే ఆప్రయాణం, ఆ సీటు సంపాదించాడని తెలుసుకుని బ్యాంక్ అధ్యక్షుడు ఆశ్చర్య పోతాడు. ఆ తర్వాత కెల్లీ పని చేసే సంస్థకే ఆ కాంట్రాక్ట్ రావడం తదనంతర పరిణామం.
వృత్తిలో ఇంత తెలివితేటలతో వ్యవహరించే కెల్లీ, తన మరణాని ఎలా ఆహ్వనించాడో రేపు చూద్దాం.