07.30.07
హిమోహసదనం నుంచి ప్రేమతో చండీదాస్
తన జీవితంలోని చివరి పదిహేనేళ్ళు అందరికి దూరంగా ఏకాంతించిన చండీదాస్, ఆ కాలంలో అడ్లూరు రఘురామరాజు గారికి వ్రాసిన ఉత్తరాల సంకలనం యిది. ఆయన రచనలు చదివి అభిమానులైన వారికి ఆయన వ్యక్తిగత జీవితం పట్ల, ఆ పదిహేనేళ్ళు (1990-2005) ఆయనేం చేశారన్న దాని మీద ఎన్నెన్నో ప్రశ్నలు. వాటిని పాక్షికంగా సమాధానీకరిస్తుంది ‘ప్రేమతో..’
ఈ ఉత్తరాలు 1984 నుండి 2005 లో ఆయన మరణించే వరకు వాయబడ్డవి అని చెప్పబడినప్పటికీ, మూడు తప్ప మిగిలిన లేఖలన్నీ 1990 నుండి వ్రాసినవే. ఒక అభిమానిగా ఆయన వద్దకు బెరుకుగా వెళ్ళిన రాజు గారు, తర్వాత్తర్వాత “మీరు వస్తారని ఎదురుచూశానని” చండీదాస్ తో అనిపించుకునేంత గాఢమైన స్నేహం నడిపారు.
ఈ పుస్తకంలో ఉత్తరాలు, హిమోహరాగిణి (తను సంగీతించిన కొన్ని ట్యూన్లు), నిర్నిరీక్షణ, అజ్ఞాతనంతూర్మిళం (వ్రాసి చించేసిన ఒక నవల్లోనుంచి తప్పించికున్న మొదటి పేజీ), పుషింపు (‘నీలి మేఘాలూ స్త్రీవాద కవితా సంపుటి సమీక్ష) ఉన్నప్పటికీ లేఖలే ప్రధాన భాగం అని చెప్పవచ్చు.
మొదటి లేఖల్లో విషయం, ఫిలాసఫీకి మాత్రమే పరిమితమైనప్పటికీ, పోను పోను తన సంగీతాభిలాష, దిన చర్య, తన బంగారు తల్లిని గూర్చిన ప్రస్తావన, తన ఆరోగ్యం, అనారోగ్యం వివిధ అంశాలపై తన ఇష్టానిష్టాలు, తీరిన, తీరని కోరికలు, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాల్లో వివిధ అంశాలపై తన క్లుప్తమైన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఉత్తరాల్లో ఒక విషయం ఎత్తితే, దాని గురించి ఒకటి లేదా మహా అయితే రెండు వాక్యాలు. క్లుప్తత బాగా కనిపిస్తుంది ఈయన ఉత్తరాల్లో. అనవసరంగా పదాలు వాదవద్దని, క్లుప్తం గా ఉండమన్న ఈయన సలహాతొనే వేగుంట మోహన ప్రసాద్ తన పేరును ‘మో’ గా మార్చుకున్నట్లు ఒక సందర్భంలో చెప్పినట్లు గుర్తు.
ఆయన నెలకొక సారో, రెండుసార్లో తన చిన్న గది నుండి వెలుపలికి వచ్చే వారని విన్నాం. వెలుపలికి వచ్చినప్పుడు తమ కుమార్తె తో మాట్లాడటం, సంగీత క్యాసెట్లు కొనడం లేదా వైద్యుణ్ణి సంప్రదించడం. గదిలో ఉన్న సమయమంతా దాదాపు సంగీతాస్వాదనలోనే గడిపారని ఈ ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. సంగీతం ఏ మాత్రం తెలీదంటూనే తనకు నచ్చిన/నచ్చని రాగాల గురించి, గాయకులు/గాయనీమణులు, వాద్య పరికరాలు, రేడియో స్టేషన్లూ, టీ.వీ. కార్యక్రమాలు గురించి విశదీకరిస్తారు.
ఈ లేఖలు చదివితే డి.డి-1, ఆకాశవాణి కేంద్రాల్లో ఇన్ని సంగీత సంబధిత కార్యక్రమాలు వస్తున్నాయా అని అనిపిస్తుంది.
తన ఇష్టాలను చెప్పే క్రమంలో ఒక లయ ఇలా ఉంటుంది. తెలుగులో పాటలు పాడే వాళ్ళలో చిత్ర గొంతు యిష్టం, చాలా యిష్టం, చాలా చాలా యిష్టం. ఇలా ఉంటుంది. ఈ లయ నచ్చి నేను ఆ వాక్యాలను మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను.
దేవదాస్ సినిమా గురించి యిద్దరి మధ్యా పెద్ద చర్చే నడుస్తుంది. ఎన్ని భాషల్లో దేవదాస్ వచ్చిందో, వాటిల్లో దేని గొప్పతనం ఏంటో వివరిస్తారు. సినిమాలు చూడడం మానేసిన తనకు టైటానిక్ చాలా బాగా నచ్చిందని, ఆ సినిమా చూడమని సలహా ఇచ్చినందుకు రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సినిమాల్లో సిమ్రాన్ ఇష్టమని, నాలో ఏదేదో అవుతున్నది (మనసిచ్చి చూడు) లో రాశిని చూడమని, నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) చూడమని రాజు గారికి సలహా ఇచ్చారు.
ఫ్యాషన్ టీ.వీ.లో లేంజరీ, హెడ్ లైన్స్ టుడేలో ప్రజ్ఞా వర్మ, రేడియోలొ వివిధ భారతి, హిందుస్తానీ ఠుమ్రీలు, గజళ్ళు, గోదావరి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం, క్రిస్టియానిటీ ప్రచారం, ఎన్.టీ.ఆర్. పతనం, ఇందిరా గాంధీ గొంతు, సురయ్యా, ఎం. ఎల్. వసంత కుమారి, కిశోరీ అమోంకర్, అన్వేషణలో భాను ప్రియ, గంగోత్రి పాటలు (కీరవాణి), కేశవ్ దండే బాసురి, రమా ఘోష్ గాత్రం, సాహిర్ లుధ్యాన్వి… ఇత్యాదిగా అనుక్షణికంలో పాత్రల లాగా లెక్క లేనంత మంది వ్యక్తులు, సంగీతం కలగలిసి గల గల పారుతున్న గోదారిలా ప్రవహిస్తూ ఉంటాయి.
తన డిజైర్ అండ్ లిబరేషన్ గ్రంధానికి వ్యాఖ్యానం వ్రాసే సంగతి గురించి అనేక ఉత్తరాల్లో రాజు గారికి గుర్తు చేస్తారు. ఒక ఆర్నెల్ల పాటు గోవా (అరేబియా) సముద్ర తీరంలో (టూరిస్టు ప్రాంతాలకు దూరంగా) గడపాలన్న తీరని కోరికను ప్రస్తావిస్తారు.
బాలమురళీకృష్ణ సంగీతం ఎంతో ఇష్టమని, ఈ మధ్య ఆయన సంగీతం కన్నా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానిస్తారు.
తమిళనాడుకు చెందిన గాయత్రి గారి గాత్రం పట్ల తన అత్యంత ఇష్టాన్ని అనేక ఉత్తరాల్లో తెలియపరచారు. అనేక మార్లు వినడం వల్ల టేపు అరిగి పోతుందని నాలుగు క్యాసెట్లు కొన్నానని చెప్తారు.
హార్మోనియం చేసే గోలని విసుక్కుంటూనే, ఎక్కడ ఎలా దాని బాగా వాడవచ్చో చెప్తారు. సాక్సా ఫోన్, సాత్పూరా, సితార్, నాదస్వరం ప్రతీ వాయిద్యాన్నీ స్పృశిస్తారు.
భారతీయుణ్ణి గనక మువ్వన్నెల జెండా నాకు నచ్చుతుంది, కానీ పాకిస్తాన్ పతాకం మంచి ఈస్థటిక్ గా అనిపిస్తుంది అంటారు.
మంచి కూచిపూడి చూసి చాలా కాలమైందని బాధపడతారొక చోట. తనను మళ్ళీ వ్రాయమని అడిగే వాళ్ళకు (రాజు గారు కూడా ఒకసారి అడిగితే మౌనమే సమాధానం) తను ఇప్పుడు వ్రాయడం చెప్పులేసుకుని కూచిపూడి చేయడం లా ఉంటుంది అంటారు.
తన గదిలో సాలీణ్ణి, బల్లిని కూడా ఉత్తరాల్లో ప్రస్తావిస్తారు.
అంత్య దశ సమీపించే కొద్దీ, ఉత్తరాల ఫ్రీక్వెన్సీ పెరిగింది. పదిహేనేళ్ళపాటు నివసించిన నెం. 321, భవానీ పురంలోని ఆ గదిలోనే 2005 జనవరి 30న చివరి శ్వాస విడిచారు.
ఈ పుస్తకంలోని ఇతర భాగాలకు వస్తే, సంగీత బాణీలు నాకు తెలీవు కాబట్టి నేను చదవలేదు. అజ్ఞాతనంతూర్మిళం ఒక్క పేజీనే ఉంటుంది.
చిట్టచివరిది నీలిమేఘాలపై సమీక్ష. సమీక్షను సమీక్షించేదేముంటుంది? కాకపోతే, తన అభిమానులను ఈ పుస్తకం కొని చదవమన్నారు.
చండీదాస్ రచనలు చదివిన వాళ్ళు, ఆయన గురించి లోతుగా తెలుసుకోగోరేవారు, ఎంత కీర్తి గడించాడో అంత అపకీర్తి నీ మూట గట్టుకున్న ఈ మనిషి మనసు లోకి తొంగి చూడా లనుకునే వాళ్ళు, చదివితే.. కొంత సంతృప్తి నిచ్చి, కొత్త ప్రశ్నలు పుట్టించే పుస్తకం ఇది.
evarOokaru చెప్పబడిన,
జులై J, 2007 వద్ద 6:41 అపరాహ్నం
Thanks!
vbsowmya చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 4:42 పూర్వాహ్నం
Hmmm….
అయితే ఇది Chandidas Unleashed! అనుకుందామా?
కొత్త పాళీ చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 2:35 అపరాహ్నం
బావుంది. పరిచయం చేసినందుకు థాంకులు.
కొత్త పాళీ చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 2:37 అపరాహ్నం
చండి దాస్ ని గురించి ఈ మధ్య బానే దుమారం రేగింది. ఇక్కడ చూడండి
http://vbsowmya.wordpress.com/2007/07/23/anukshanikam/
Prasanthi చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 6:32 అపరాహ్నం
This is as usual hilarious. I remember in our first meeting of TP friends, you spoke of your admiration for Chandidas and the way he repeats a word to stress and how it adds beauty to the expression.
I do not know about him and I never read any of his books. So I can’t say.
Reviews on Review books are also good. People like me gets an idea, even vague.
nuvvusetty చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 10:20 పూర్వాహ్నం
బ్లాగులో చదవటం బాగుంది బాసూ
నాగరాజా చెప్పబడిన,
ఆగష్టు J, 2007 వద్ద 5:11 అపరాహ్నం
బాగుంది బ్లాగు. చండీదాస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తికి పెంచారు.