02.07.08

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు.

వర్గాలు నా గొడవ వద్ద 10:57 పూర్వాహ్నం ద్వారా poolavaana

ఈ రోజు పొద్దున్నే సీనియర్ నటి కల్పనా రాయ్ చని పోయారనే వార్త మెరుగైన సమాజం కోసం ఆరాట పడే ఒక ఛానెల్ లో వినగానే ఈ టపా వ్రాయాలనిపించింది.

రేడియోలో వార్తలు వినే తొలి నాళ్ళలో, వార్తలు చదువుతున్న వాళ్ళెవరైనా, మామూలుగా వార్తలు చదివే టెంపోని మార్చి, గొంతులో విషాదం ధ్వనించేలా ప్రముఖ నటుడు ---- ఈరోజు ఉదయం  నాలుగున్నర గంటలకు మరణించారు. ఆయన వయస్సు -- సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ ---- అనేక చిత్రాల్లో... ఇలా సాగి పోయేది.ఆ చనిపోయింది ఎవరైనా సరే, వార్త చెప్తే గనక చావు వార్తలన్నీ ఈ టెంపోలోనే, ఆ విషాద స్వరంలోనే చదివే వారు. ఆ పోయింది గనక, ప్రముఖ రాజకీయ వేత్తో గనక అయితే, వీరి మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది అని ఆ నాల్రోజులూ, శాస్త్రీయ సంగీతం, భక్తీ గీతాలు ప్రసారం చేసేసి, యే నాటకం కోసమో, టీ.వీ. అయితే ఎన్.టి.ఆర్/కృష్ణ సినిమాకోసం ఎదురు చూస్తున్న పిల్లలను నీరుగార్చేసేవారు. అనేక సందర్భాల్లో వీళ్ళు ఇప్పుడే పోవాలా, ఇంకో వారం ఆగి పోకూడదూ అని అనిపించేది.

ఈ వార్త అయిపోయాక ఇండియా, క్రికెట్ లో ఇంగ్లాండ్ చేతిలో చావు దెబ్బ తిన్న విషయానికి వచ్చే సరికి వార్తలు చదివేవారి గొంతు మళ్ళీ మారిపోయేది.

ఇంక కొన్నాళ్ళు ఆగి, టీ.వీ. వచ్చాక వీళ్ళ పని ఇంకాస్త కష్టమయింది. గొంతుతో పాటు, ముఖ కవళికల్లో కూడా కాస్త విచారం చూపించాలి, చూపించేవారు కూడా..

ఈ తేడా శాంతి స్వరూప్ గారైతే మరీ బాగా తెలిసేది. నాకు తెలిసి, హైదరాబాద్ టి.వీ. వచ్చాక మొదటి టీ.వీ. ప్రముఖుడు (సెలిబ్రిటీ) ఆయనేనేమో. ఉచ్చారణ, స్పష్టత, ముఖ కవళికలు మొదలైన వాటి పరంగా నాకు బాగా నచ్చే వార్తా చదువరి (న్యూస్ రీడర్, తెలుగులో మరింత సాదృశ పదం ఉంటే చెపండి, మారుస్తాను). కాకపోతే ఆయన కాంగ్రెస్ పక్షపాతి అని విన్నాం. 1995 లో తెలుగు దేశం చేతిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తిన్నదన్న వార్తలు, దూరదర్శన్ లో చూసిన వారికి అది నిజమే అనిపిస్తుంది. ఆయన వదనం/గొంతులో అంత విషాదం మరే విషాద సందర్భంలోను కని/విని ఉండలేదు.

ఈ విధంగా రేడియోల్లో, దూరదర్శన్ లో చావు వార్తలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఉపగ్రహ టి.వీ. ఛానెళ్ళొచ్చాక, వార్తా చదువరుల కొరత వల్లో, శిక్షణకు అంతంత మాత్రంగా ఉండటం వల్లో, లేక మరే కారణమో గానీ చావు వీళ్ళకి మామూలైపోయింది.

ఆ మామూలు అందరికీ మామూలైపోతే పరవాలేదు, ఈ చావుల్లో చచ్చేటన్ని రకాలున్నాయి. వివరాల్లోకి వెళ్ళదలచుకోలేదు. సంపన్న ప్రముఖుడు చనిపోతే వాడబడే పదాలు 'మరణించారు/మృతిచెందారు/పరమపదించారు/కన్నుమూశారు ' మొ. 'ఆయన వయస్సు -- సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు ' ఇలా ఉంటుంది. అదే కల్పనారాయ్ వంటి తార (స్టార్) కాని, బీద నటి పోతే మాత్రం >'చనిపోయింది/చనిపోయాడు. గత కొన్నాళ్ళుగా జబ్బుపడింది. ఆమెకు ఒక కూతురు ఉంది '. ఆ మృతదేహం అంతకన్నా గౌరవానికి నోచుకోదా? సంపన్న మృతదేహానికీ - బీద/మధ్య తరగతి మృతదేహానికీ ఏమిటీ వ్యత్యాసం? తెలిస్తే నాకు చెప్పండి.

తర్వాతి పేజీ